: ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలను ఖండించిన హెరిటేజ్ యాజమాన్యం
హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం తరలిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమనడం, అది వాస్తవం కాదని పోలీసులు తేల్చిచెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెరిటేజ్ సంస్థ యాజమాన్యం స్పందించింది. హెరిటేజ్ పాలవ్యాన్ లో ఎర్రచందనం తరలిస్తున్నారనే ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొంది. పట్టుబడ్డ వాహనానికి, హెరిటేజ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హెరిటేజ్ సంస్థ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా యాజమాన్యం హెచ్చరించింది.