: తప్పిపోయిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఆచూకీ లభ్యం
అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రమాదంలో చిక్కుకున్న ప్రజల్ని కాపాడడానికి వెళ్లి, అదృశ్యమైన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఆచూకీ దొరికింది. యూపియా ప్రాంతంలోని ఒక లోయలో హెలికాప్టర్ శకలాలు కనిపించాయి. ఇద్దరు సిబ్బంది, ఒక పోలీసు అధికారితో బయల్దేరిన హెలికాప్టర్ మంగళవారం తప్పిపోయింది. అందులో వున్న ఆ ముగ్గురి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. భారీ వర్షాల కారణంగా పాపుం పరే జిల్లాలోని సగాలీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతుండటంతో అక్కడి ప్రజల్ని తరలించేందుకు ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దింపింది.
అందులో భాగంగా పనిచేస్తున్న ఈ అడ్వాన్స్‌డ్ లైట్‌వెయిట్ హెలికాప్టర్ మంగళవారం సాయంత్రం రాడార్ నుంచి మాయమైంది. అప్పటికే ఐదు సార్లు ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఈ హెలికాప్టర్ ఆరోసారి ప్రజల్ని ఎక్కించుకోకుండా ఒక పోలీసు అధికారిని మాత్రమే తీసుకొని బయలుదేరింది. తర్వాత కొద్దిసేపటికి రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. ఇదిలా ఉండగా వరద ముంపు ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల సాయంతో ఇప్పటికే 169 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ట్వీట్ ద్వారా తెలియజేశారు.