: రణ్ వీర్ సింగ్ కు పుట్టినరోజు కానుక.. ప్యారిస్ మ్యూజియంలో మైనపు విగ్రహం!
రేపు తన పుట్టినరోజు జరుపుకోనున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్ వీర్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ప్యారిస్ లోని గ్రెవిన్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా రణ్ వీర్ మాట్లాడుతూ, ‘ఇది నిజంగా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది. ప్యారిస్ లో గడిపిన మధుర ఙ్ఞాపకాలను గుర్తుకుతెస్తాయి.. నా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వారి దేశంలో, హృదయాల్లో నాకు శాశ్వతమైన స్థానాన్ని కల్పిస్తున్న మ్యూజియం నిర్వాహకులకు నా కృతఙ్ఞతలు’ అన్నాడు.
కాగా, గత ఏడాది యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘బేఫికర్’ చిత్రం షూటింగ్ అధిక శాతం ప్యారిస్ లోనే జరిగింది. అక్కడ గడిపిన ప్రతి క్షణాన్ని రణ్ వీర్ ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలో ప్రముఖ శిల్పి ఎరిక్ సెయింట్ చాఫ్రే, గ్రెవిన్ మ్యూజియానికి చెందిన ఆర్టిస్ట్ ల బృందం రణ్ వీర్ ను కలిశారు. రణ్ వీర్ మైనపు విగ్రహాన్ని తయారు చేసే నిమిత్తం ఆయన శరీర కొలతలను తీసుకున్నారు. కాగా, షారూక్ ఖాన్, ఐశ్వర్యరాయ్ తర్వాత ఆ గౌరవాన్ని దక్కించుకోనున్న బాలీవుడ్ నటుడు రణ్ వీర్ కావడం విశేషం.