: మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే అంతే సంగతి: చంద్రబాబు
సంక్షేమ పథకాల్లో భాగంగా తాము ప్రతి లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశామని, ఇందులో అక్రమాలు దొర్లకూడదని ఆధార్ కార్డుని కూడా అనుసంధానం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా ముక్తాపురంలో ఆయన మాట్లాడుతూ... ‘ఒకప్పుడు మీరు చూసేవారు.. దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవి.. అదీ కాంగ్రెస్ పాలన ప్రభావం.. మన పాలనలో దెయ్యాలు లేవు. అయితే, మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే మాత్రం మళ్లీ దెయ్యాలు వస్తాయి... కష్టాలు వస్తాయి.. అందుకే మీ దగ్గరనుంచి నేను కోరుకునేది ఒక్కటే, మీ నుంచి నాకు పూర్తి సహకారం కావాలి’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పక్కదారి పట్టే అవకాశమేలేదని అన్నారు.
డ్వాక్రా మహిళలకు, వృద్ధులకు పింఛన్లు అందిస్తున్నామని, నేరుగా డబ్బు లబ్ధిదారుడికే అందేలా, అక్రమాలు దొర్లకుండా చూస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. గర్భిణులకు ఎన్టీఆర్ కిట్, బసవతారకం కిట్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆరు వేల రూపాయల సాయం చేస్తున్నామని అన్నారు. ఎవరయినా చనిపోతే 'మహాప్రస్థానం' పేరుతో వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి, వారి అంత్యక్రియలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం తాము చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అన్నింటినీ ఉపయోగించుకుంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.