: నా భర్త సూర్యలో స్వార్థం అనేది లేదు.. అలాంటి వ్యక్రిని ఎక్కడా చూడలేదు!: జ్యోతిక
ప్రముఖ నటుడు సూర్యకు స్వార్థం అనేది లేదని ఆయన భార్య, నటి జ్యోతిక ప్రశంసలతో ముంచెత్తారు. ఓ టీవీ షోలో పాల్గొన్న జ్యోతిక తన భర్త గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. సూర్యలోనే తన కుటుంబాన్ని చూసుకుంటున్నానని, ఆయన గుణాల్లో కనీసం సగం గుణాలు తన కుమారుడు దేవ్ కి వస్తే చాలా సంతోషిస్తానని చెప్పింది. సూర్య తన గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పిన జ్యోతిక, కళాశాలలో చదువుకునేటప్పుడు, పనిచేసే చోట ఎంతోమందిని చూశాను కానీ, సూర్యలాంటి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని పేర్కొంది.
తన దృష్టిలో ‘ప్రేమ’ అంటే.. నిస్వార్థంగా ఉండటం, మన అవసరాలను పక్కనపెట్టి ఎదుటి వ్యక్తికి ఏం కావాలో చూడటంతో పాటు తన భాగస్వామికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడమని చెప్పుకొచ్చింది. మరో ఆసక్తికర విషయాన్ని జ్యోతిక ప్రస్తావిస్తూ..తన భర్తకు కనీసం ఓ కప్పు కాఫీ కూడా తన చేతులతో కలిపి ఇవ్వలేదని, అలా చేయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. ‘మీ ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు .. సూర్య ఇంత మంచి భర్త కాగలడని అనుకున్నారా?’ అనే ప్రశ్నకు జ్యోతిక సమాధానమిస్తూ.. ‘అందుకే, సూర్యను పెళ్లి చేసుకున్నా. ఆయన ఎప్పుడూ అలానే ఉంటారు’ అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.