: విదేశీ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రో పెద్దదిక్కు.... కానీ 90 శాతం సేవలు మనకే!
భారత తొలి శాటిలైట్ ఆర్యభట్టను అంతరిక్షంలోకి పంపించడానికి రష్యన్ల సహకారం కోరాల్సివచ్చింది. ఆ రోజుల్లో శాటిలైట్ తయారు చేయడమే గొప్పపని, ఇక దాన్ని లాంచ్ చేసే టెక్నాలజీ భారతీయులకు అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు మన శాటిలైట్లతో పాటు ఇతర దేశాల శాటిలైట్లను కూడా పంపించే స్థాయికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎదిగింది. ఈ విజయాలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) పునాది వేసింది.
'ఆంట్రిక్స్' పేరుతో ఒక వాణిజ్య శాటిలైట్ లాంచింగ్ సంస్థను ఏర్పాటు చేయగల స్థాయికి పీఎస్ఎల్వీ ఇస్రోను తీసుకెళ్లింది. అమెరికాకు చెందిన 'స్పేస్ ఎక్స్' సంస్థలాగా, 'ఆంట్రిక్స్' ద్వారా ఇస్రో లాభాలు గడించవచ్చు. కానీ భారతీయుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యంగా పాటుపడే ఇస్రో ప్రయోగించే లాంచ్ వెహికల్ లో మన శాటిలైట్లకు సరిపడ స్థలం పోగా, మిగిలిన భాగాన్ని మాత్రమే వాణిజ్యపరంగా విదేశీ శాటిలైట్లకు ఇస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఇస్రో ప్రయోగించిన 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఉపగ్రహాల్లో అతి ఎక్కువ బరువున్నది మన కార్టోశాటే (714 కేజీలు).
ఇస్రో విజయాల పరంపరలో 1999 నుంచి జూన్ 2017 వరకు చూసుకుంటే ఇప్పటివరకు 28 దేశాలకు చెందిన 209 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. వీటన్నిటి బరువు కలిపి 6,694 కేజీలు మాత్రమే. 'స్పేస్ ఎక్స్', ఫ్రాన్స్‌కు చెందిన 'ఫ్రెంచ్ అరియానే' వంటి ప్రైవేట్ లాంచింగ్ సంస్థలు పంపిన శాటిలైట్ల బరువుతో పోలిస్తే ఇది తక్కువే. దీన్ని బట్టి చూస్తే వాణిజ్య అవసరాల కంటే దేశ అవసరాలకే ఇస్రో పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తుంది.
గత రెండేళ్లుగా కొన్ని అవసరాల రీత్యా వాణిజ్యపరంగా శాటిలైట్ల లాంచింగ్‌ను ఇస్రో ముమ్మరం చేస్తోంది. భవిష్యత్తులో పీఎస్ఎల్వీ ప్రయోగాలను సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిదికి పెంచే యోచనలో ఉంది. అలాగే పీఎస్ఎల్వీ కంటే ఎక్కువ బరువును మోయగల హెవీ లిఫ్ట్ వెహికల్ (హెచ్ఎల్వీ)ని ఇస్రో అభివృద్ధి చేస్తోంది. సెమీ క్రయో ఇంజిన్ ప్రొపల్షన్ టెక్నాలజీతో పనిచేసే ఈ హెచ్ఎల్వీ అందుబాటులోకి వస్తే వాణిజ్య పరంగా విదేశీ శాటిలైట్ల లాంచింగ్ సంఖ్య పెరగనుంది.