: పనులకి రాక్షసుల్లా అడ్డుపడ్డారు.. ఓ యజ్ఞంలా పూర్తిచేశాను: చంద్రబాబు
తాను రాష్ట్రంలో ప్రాజెక్టులను ఓ యజ్ఞంలా తలపెట్టానని, ఎంతో మంది వాటికి ఆటంకాలు సృష్టించారని, రాక్షసుల్లా అడ్డుపడ్డారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయినప్పటికీ వారి కుట్రలను తిప్పికొట్టి అన్ని పనులను పూర్తి చేశానని చెప్పారు. ఈ రోజు అనంతపురం జిల్లా ముక్తాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అయినా పనిచేసేది ప్రజలు ఆనందంగా ఉండాలనేనని, తాము ఎంతో సమర్థవంతంగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నామని చెప్పారు. కొందరు రాయలసీమకి నీళ్లు రావని మాట్లాడారని, పట్టిసీమ వద్దన్నారని అన్నారు. తాను గనుక నీళ్లు వచ్చేలా చేయకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోయేదని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం ప్రతి సోమవారాన్ని 'పోలవారం'గా ప్రకటించిందని, ఆ రోజు ఆ ప్రాజెక్టు పనుల గురించి స్వయంగా తెలుసుకుంటున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. తాము రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులనే తేడా లేకుండా అందరికీ రుణమాఫీ చేశామని చెప్పారు. విభజన సమయంలో ఆదాయం, పరిశ్రమలు లేవని, దానికి తోడు వరదలు, తుపానులు వచ్చాయని, అన్ని సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కున్నామని అన్నారు. సమస్యల సుడిగుండం నుంచి అనంతపురాన్ని పూర్తిగా బయటకు తీసుకురావాలని తాము కృషి చేస్తున్నామని తెలిపారు.