: బెంగళూరులో కలకలం... వారంలో 200 మందిని ముంచేసిన సైబర్ నేరగాళ్లు
వారం రోజుల వ్యవధిలో సుమారు 200 మందికి పైగా బెంగళూరు వాసులు సైబర్ క్రైమ్ నేరగాళ్ల బారినపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకుంటున్న కస్టమర్లను టార్గెట్ చేసుకుని, వారి కార్డులను క్లోనింగ్ చేయడం ద్వారా, మోసగాళ్లు దాదాపు రూ. 10 లక్షలను దండుకున్నారు. అడ్వర్టయిజ్ మెంట్ ప్రొఫెషనల్ గా పని చేస్తున్న రజిత్ రవి సోమవారం రాత్రి 11:53కు, అతని ఖాతా నుంచి రూ. 30 వేల డబ్బు థానేలోని ఏటీఎం నుంచి డ్రా అయిందని తెలుసుకుని బావురుమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించగా, మొత్తం వ్యవహారం బయటపడింది.
కైలాసనహళ్ళికి చెందిన సర్వేష్ ఆరాధ్య అనే వ్యక్తి తన ఖాతా నుంచి 19,500 పోయాయని ఫిర్యాదు చేయగా, ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన ఎం.అజ్మత్ అనే ఉద్యోగి తన ఖాతా నుంచి రూ. 60 వేలు పోయాయని ఫిర్యాదు చేశాడు. ఇలా మొత్తం 35 మంది ఫిర్యాదు చేయడంతో సమస్య తీవ్రతను తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 200కు పైగా మోసాలు జరిగాయని గుర్తించామని, ఫోరెన్సిక్ ఫౌండేషన్ కు నేరగాళ్లను గుర్తించే పనిని అప్పగించామని సైబర్ క్రైమ్ అనలిస్ట్ కేఎస్ సంతోష్ తెలిపారు.