: మళ్లీ మళ్లీ చెబుతున్నా.... మా తమ్ముడి ముఖాన్ని చూడలేకే వెళ్లలేదు!: రవితేజ
ప్రముఖ సినీ నటుడు రవితేజ తన సోదరుడు భరత్ మృతిపై మరోసారి స్పందించాడు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, తన సోదరుడ్ని ఆ స్థితిలో చూడలేకే చివరి చూపుకు వెళ్లలేదని తెలిపాడు. తమ్ముడంటే ఎవరికి ప్రేమ ఉండదని అడిగాడు. తమ భావాలేంటో తెలుసుకోకుండా తమపై అవాస్తవ కథనాలు ప్రచురించడం సరైన విధానం కాదని రవితేజ చెప్పాడు.
తన సోదరుడు భరత్ అంత్యక్రియలు పూర్తి చేసింది ఎవరో కాదని, తన మరో సోదరుడు, తమ చిన్నాన్న కలసి పూర్తి చేశారని అన్నాడు. తరువాత సినిమా షూటింగ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో హాజరుకావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. తెలిసిన వారు వచ్చినప్పుడు చిరునవ్వు సహజమని అన్నాడు. తానొక్కడినే షూటింగ్ ఎగ్గొడితే మిగిలిన 15 మంది డేట్స్ అడ్జెస్ట్ చేయడం చాలా కష్టమైన పని అని రవితేజ చెప్పాడు. తాను మీడియాని విమర్శించలేదని, సోషల్ మీడియాలో తెలుసుకోకుండా రాసిన వార్తలను ఖండించానని రవితేజ తెలిపాడు.