: శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రజ్ఞుల్లోనే గొప్పవాడు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
భారతీయుల మేధోశక్తి సామర్థ్యాలను గుర్తుచేస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, భారత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ను గణిత శాస్త్రవేత్తల్లోనే గొప్పవానిగా కీర్తించారు. భారతీయుల మేధో సంపత్తికి ఆయన నిదర్శనం అని కొనియాడారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లిన సందర్భంగా నిర్వహించిన ఆహ్వాన సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ - `భారత ప్రజలపై మాకు చాలా గౌరవముంది. ముఖ్యంగా వారి మేధోశక్తిపై ఎనలేని పూజ్యత ఉంది. ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గణితజ్ఞునిగా పనిచేసిన మా బంధువు, భారత గణితవేత్త శ్రీనివాస రామానుజన్ గురించి నిరంతరం చెబుతుండేవారు. ఆయన మేధోశక్తిని శ్లాఘిస్తుండేవారు. వారి మాటలే భారతీయుల మేధస్సుపై నాకు గౌరవాన్ని కలిగించాయి` అన్నారు.
ఇరుదేశాల మధ్య మేధో సంబంధ భాగస్వామ్యం పెంపొందించేందుకు సహకరించాలని ఆయన మోదీని కోరారు. ఇజ్రాయెల్ దేశపర్యటనకు వెళ్లిన మొదటి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. అక్కడ మూడు రోజుల పాటు ఉండి ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాల గురించి మోదీ చర్చించనున్నారు.