: ఆ రోజు బట్టలు మార్చుకునే సమయం కూడా లేదు: ప్రియాంకా చోప్రా తల్లి మధు
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వేళ, ప్రియాంకా చోప్రా కాళ్లు కనిపించేలా పొట్టి డ్రస్సు వేసుకుని రావడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రియాంక తల్లి మధూ చోప్రా తొలిసారిగా స్పందించారు. ముంబైలో ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియాలో, ఆన్ లైన్ జర్నలిజంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తున్నారని ఆరోపిస్తూ, తన కుమార్తెపై విమర్శలు వచ్చిన తరువాత తానే ధైర్యం చెప్పానని అన్నారు.
"వాస్తవానికి ఆ రోజు 'బేవాచ్' ప్రమోషన్ కోసం ప్రియాంక బయలుదేరింది. అనుకోకుండా మోదీని కలవాల్సి వచ్చింది. కనీసం వెనక్కు వెళ్లి మరో డ్రస్ వేసుకునే సమయం కూడా ఆమెకు లేదు. అందుకే అదే డ్రస్ లో వెళ్లి పలకరించింది. ఈ సమావేశం ముందుకు ప్లాన్ చేసుకున్నది కాకపోవడం వల్లే ఇలా జరిగింది" అని మధు చెప్పారు. ఏం జరిగి ఉంటుందన్న కనీస విచారణ, వాస్తవాన్వేషణ లేకుండా నాడు తన కుమార్తెను విమర్శించారని ఆమె ఆరోపించారు.