: మోషేను ఆప్యాయంగా పలకరించి, శాండ్రాను కుశలమడిగిన నరేంద్ర మోదీ
ఇజ్రాయెల్ లో నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం అధ్యక్షుడు రియువెన్ రివ్లిన్ తో పాటు పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ, ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చలు జరిపారు. అంతకుముందు, 2008 ముంబై ఉగ్రదాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయి, అనాధగా మిగిలిన మోషే హోల్ట్ బర్గ్ ను మోదీ కలుసుకున్నారు. మోషేను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించిన మోదీ, అతన్ని కాపాడిన భారత ఆయా శాండ్రా సామ్యూల్స్ ను కుశలమడిగారు.
ముంబై ఉగ్రదాడుల తరువాత ఒంటరిగా మిగిలిన మోషేతో పాటు శాండ్రా సైతం ఇజ్రాయిల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. శాండ్రాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మోషే వయసు పదేళ్లు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వస్తుంటే, తమ కుటుంబాన్ని ఆహ్వానించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మోషే తాతయ్య, నానమ్మలు వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ లో కాలు పెట్టిన తొలి భారత ప్రధానిగా నిన్న నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించగా, ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అప్పటి నుంచీ మోదీ వెంటే ఉన్నారు. ఇక మోదీ పర్యటన రేపటితో ముగియనుండగా, ఆపై జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన బయలుదేరనున్నారు.