: వరల్డ్ కప్ లో పాక్ భరతం పట్టిన ఎక్తాబిస్త్.. ఓ చాయ్ వాలా కుమార్తె!


ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఏక్తాబిస్త్ నిలిచింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఏక్తా బిస్త్ కేవలం 18 పరుగులిచ్చి పాకిస్థాన్ కు చెందిన కీలకమైన 5 వికెట్లు తీసింది. ఈ మ్యాచ్ తో ఏక్తా బిస్త్ స్టార్ గా మారింది. ఈ నేపథ్యంలో ఏక్తా బిస్త్ నేపథ్యం తెలుసుకుంటే ఆశ్చర్యమనిపించకమానదు. ఏక్తా బిస్త్‌ది ఉత్తరాఖండ్‌ లోని అల్మోరా. తండ్రి కుందన్‌ సింగ్‌ బిస్త్‌. ఇండియన్‌ ఆర్మీలో హవల్దార్‌ గా పనిచేసి 1988లో రిటైర్‌ అయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయనకు పింఛనుగా 1500 రూపాయలు చేతికి వచ్చేవి. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అయినా ఆయన ఏ రోజూ ఆత్మస్థైర్యం వీడలేదు.

ఆరేళ్ల వయసులోనే ఏక్తా క్రికెట్ పై అభిమానం చూపించేది. అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. దీంతో ఆమె కలను సాకారం చేసేందుకు ఆయన టీస్టాల్ ప్రారంభించారు. వచ్చే సంపాదనతోనే కుమార్తెకు అన్నీ సమకూర్చేవాడు. దీంతో అత్యుత్తమ ప్రతిభతో ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ టీమ్‌ కు సెలెక్ట్ అయింది. అక్కడ రాణించడంతో 2006లో ఆ జట్టు కెప్టెన్‌ గా వ్యవహరించింది. 2007 నుంచి 2010 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టు తరఫున ఆడింది. 2011లో జాతీయ జట్టులో స్థానం సాధించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అనంతరం ఆమెకు స్పాన్సర్స్ దొరకడంతో కుటుంబ ఆర్థిక కష్టాల నుంచి బయటపడింది. ఇప్పుడు పాక్ తో మ్యాచ్ తరువాత ఏక్తా బిస్త్ స్టార్ క్రికెటర్ గా మారింది.  

దీనిపై ఆమె తండ్రి కుందన్ సింగ్ మాట్లాడుతూ, తన కుమార్తె స్టార్ అవుతుందని తనకు ఆమె చిన్నప్పుడే తెలుసని అన్నారు. పాక్ తో మ్యాచ్ లో రాణించి, ఆ జట్టును కుప్పకూల్చడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆమె మంచి క్రికెటర్ మాత్రమే కాదని, బాధ్యత గల కుమార్తె అని ఆయన పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోయారు. ఇప్పుడాయనను అంతా అభినందిస్తుంటే కుమార్తె విజయాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News