: రాజీ ప్రసక్తే లేదు.. ఇండియా తీసుకునే నిర్ణయంపైనే తదుపరి చర్యలు ఉంటాయి.. తేల్చి చెప్పిన చైనా!


ప్రస్తుతం భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కారణం భారతేనని, సమస్యను ఆ దేశమే పరిష్కరించాల్సి ఉంటుందని డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని, బంతి భారత్ కోర్టులోనే ఉందని పేర్కొంది. ఈమేరకు భారత్‌లో చైనా రాయబారి లువో ఝావోహి పేర్కొన్నారు. ‘‘బంతి భారత్ కోర్టులోనే ఉంది. సరిహద్దులో స్టాండాఫ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడు ఇండియానే’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న చైనా పత్రికల కథనాలపై ఆయనను ప్రశ్నించగా.. అది భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని విస్పష్ట సమాధానం ఇచ్చారు. సమస్య శాంతియుత పరిష్కారానికే చైనా మొగ్గు చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే అందుకు ముందుగా భారత్ తమ దళాలను వెనక్కి పిలవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చర్చలకు తమ ముందస్తు షరతు ఇదేనని లువో నొక్కి చెప్పారు. కాగా, భూటాన్ త్రికూడలి (ట్రై జంక్షన్) అయిన డోక్లాం వద్ద గత 19 రోజులుగా భారత్-చైనా ఆర్మీ స్టాండాఫ్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News