: విండీస్ క్రికెటర్ కు గిఫ్ట్ ఇచ్చిన యువీ
టీమిండియా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావోకు గిఫ్ట్ ఇచ్చాడు. తొలి వన్డే అనంతరం టీమిండియా ఆటగాళ్లందర్నీ డ్వెన్ బ్రావో తన ఇంటికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా బ్రావో ఇంటికి వెళ్లి ఉత్సాహంగా గడిపారు. ఆ సమయంలో బ్రావో సోదరుడు డారెన్ బ్రావో కూడా వారితో కలిసి ఉత్సాహంగా గడిపాడు. తాజా వన్డే సిరీస్ కు డారెన్ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో అతనిలో ఉత్సాహం నింపేందుకు యువరాజ్ సింగ్ తన బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. యువీకెన్ సంస్థ స్పాన్సర్ చేస్తున్న బ్యాటును డారెన్ బ్రావో ఆనందంగా తీసుకుని, మళ్లీ జట్టులోకి వచ్చేందుకు శ్రమిస్తానని చెప్పాడు. కాగా, వెస్టిండీస్ టూర్ లో టీమిండియా ఆటగాళ్లు ఒకవైపు ఆడుతూనే వివిధ ప్రాంతాల్లో కలియదిరుగుతూ టూర్ ను ఆస్వాదిస్తున్నారు.