: రామూ గారు! ఎన్టీఆర్ పై బయోపిక్ తీయకండి: పోసాని కృష్ణ మురళి


మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన కొంచెం సేపటికే, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి స్పందించారు. తాజాగా, ఈ విషయమై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఓ న్యూస్ ఛానెల్ లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

 బయోపిక్ తీస్తే కనుక, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిందేనని, వ్యక్తిగత జీవితం ముట్టుకోకుండా సినిమా తీయలేరని, నందమూరి కుటుంబసభ్యులను బాధపెట్టడం ఎందుకు? బయోపిక్ తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర మొత్తం వర్మకు తెలుసని చెప్పారు. ఎన్టీఆర్ పై నిర్మించనున్న బయోపిక్ లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తే ఆ సినిమాకు న్యాయం జరగదన్న లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై తాను స్పందించనని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆమె అంటే తనకు గౌరవమని, అక్కలాంటి వారని, ఆమె తన బాధలో నుంచి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అన్నారు. ‘రాము గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.. ఎన్టీఆర్ పై బయోపిక్ తీయాలనే ఆలోచనను విరమించుకుంటే మంచిదని చెబుతున్నాను’ అని పోసాని చెప్పుకొచ్చారు.  
 

  • Loading...

More Telugu News