: భారత ఆర్మీ వెనక్కి వెళ్లకపోతే.. ఇక మా మిలటరీని రంగంలోకి దింపక తప్పదు: చైనా మరో హెచ్చరిక
భారత్, చైనాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు దేశాలూ వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం ఏర్పడే అవకాశాలు అధికమైపోతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. చైనా మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మాత్రం మానుకోవడం లేదు. తమదేశ సైనిక శక్తి ఎంతో గొప్పదంటూ వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా మరోసారి భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. సిక్కిం ప్రాంత సరిహద్దులో భారత బలగాలు వెనక్కి వెళ్లకపోతే తమ మిలటరీని రంగంలోకి దింపక తప్పదని చైనీస్ అధికార మీడియా హెచ్చరించింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల చైనా విశ్లేషకుడు హు జియాంగ్ స్పందిస్తూ.. చైనా మొదట శాంతియుతంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నాడు. ఇండియా వినకపోతే బల ప్రయోగం తప్పదని, చైనాకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించాడు. చైనాను తాము అడ్డుకోగలమని అమెరికాకు నిరూపించే క్రమంలోనే భారత్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను భారత్ అడ్డుకోలేదనే నమ్ముతున్నారని ఆయన అన్నారు.
మరోవైపు, తమ దేశం కంటే ఇండియా ఎంతో వెనుకబడి ఉన్న కారణంగా తాము భారత్‌ని ప్రధాన ప్రత్యర్థిగా భావించబోమని మిలిటరీ ఎక్స్‌పర్ట్ సాంగ్ జాంగ్‌పింగ్ వ్యాఖ్యలు చేశారు. తమ ఆర్మీ భారత సైన్యం కంటే ఎంతో శక్తిమంతంగా ఉందని, ఇండియా వెనక్కితగ్గితే మంచిదని హెచ్చరించారు.