: ఖండాంతర క్షిపణి సక్సెస్... ఇక ఏ దేశాన్నైనా టార్గెట్ చేయగలం: నార్త్ కొరియా ప్రకటన
ఓ వైపు అమెరికా ఈ రోజు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. మరోవైపు ఉత్తరకొరియా మరోసారి చెలరేగిపోయి పశ్చిమ ప్రాంతం నుంచి సముద్రంలోకి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి కలకలం రేపిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల్లోనే జర్మనీలో జీ20 సదస్సు కూడా జరగనుంది. ఈ సమయంలో ఉత్తరకొరియా తాజా చర్య ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఉత్తరకొరియా తన చర్యను సమర్థించుకుంటూ, ‘అవును.. బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించాం.. విజయవంతం అయింది’ అని తాజాగా ప్రకటించుకుంది.
తాము ప్రయోగించిన ఖండాంతర క్షిపణి పరీక్ష విజయం కావడంతో ఇక ప్రపంచంలో ఎక్కడైనా టార్గెట్‌ను ఛేదించగలమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. తమ దేశం హసంగ్-14 మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు నార్త్ కొరియా జాతీయ టీవీ ద్వారా ఈ ప్రకటన చేసి, మరింత స్పష్టతనిచ్చింది. ఈ ప్రయోగాన్ని కూడా తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షించినట్లు తెలిపింది.