: నా పేరు ప్రకటించగానే టీఆర్ఎస్ మద్దతు తెలిపింది: రామ్‌నాథ్ కోవింద్
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ప్రభుత్వం సాదర స్వాగతం పలికి, అనంతరం ఆయనతో సమావేశం అయింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. రామ్‌నాథ్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మీయ సత్కారం చేసింది. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికే వన్నె తెస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధ పదవులు స్వీకరించినప్పుడు వాటికి తగిన విధంగా నడుచుకోవాలని, తనకు అప్పగిస్తోన్న బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే తన లక్ష్యమని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అటువంటి భారత్‌లో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని అన్నారు. తాను బీహార్ గవర్నర్‌గా పనిచేసినప్పుడు కూడా ఏ పార్టీవైపునా పక్షపాతం చూపించలేదని అన్నారు. బీజేపీ అధిష్ఠానం తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని అన్నారు. తాను నామినేషన్ వేసే సమయంలోనూ టీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని చెప్పారు.