: 'అనంత' హత్యల్లో హంతకుడు తండ్రే... పోలీసులు, బంధువుల అనుమానం!
అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ కృష్ణాపురంలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల హత్యలో నిందితుడు మృతురాలి భర్త అని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. హతురాలు సులోచనకు రామసుబ్బారెడ్డి రెండో భర్త అని వారు తెలిపారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే రామసుబ్బారెడ్డి వ్యసనాలకు బానిసై, డబ్బు తగలేస్తున్నాడని కుటుంబంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబంపై కక్షగట్టిన రామసుబ్బారెడ్డి తన భార్య నల్లపురెడ్డి సులోచన, కుమార్తెలు ప్రసన్న, ప్రతిభలను సుత్తితో అత్యంత పాశవికంగా కొట్టిచంపాడు.
సులోచన, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రతిభ మాత్రం కొనఊపిరితో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతిలో ఫార్మసీ చేస్తున్న పెద్ద కుమార్తె ప్రత్యూష దూరంగా ఉండడంతో బతికిపోయింది. కాగా, వారిని హతమార్చిన అనంతరం రామసుబ్బారెడ్డి ఈ ఉదయం వేకువజామున కాంచన ఆసుపత్రి దగ్గర ఆటోఎక్కి వెళ్లడం చూశామని అతని బంధువులు చెబుతున్నారు. దీంతో అతని కోసం గాలింపు చేపట్టారు.