: ఎన్టీఆర్ జీవిత చరిత్రతో రామ్ గోపాల్ వర్మ సినిమా.. వివాదాస్పద అంశాలుంటాయన్న సంచలన దర్శకుడు


మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నట దిగ్గజం ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ జీవితంలో ఉన్న వివాదాస్పద వ్యక్తులు, వివాదాస్పద అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఆయన తెలిపాడు. ఎవరికీ తెలియని విషయాలు ఇందులో ఉంటాయని చెప్పాడు. తెలుగు రాజకీయ రంగాన్ని శాసించి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసి, చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నానని... ఈ సినిమాలో ఎన్టీఆర్ శత్రువులు ఎవరు, కుట్రలు చేసింది ఎవరు, కుట్రల వెనకున్న అసలు కుట్రలు ఏంటో తన సినిమాలో చూపిస్తానని చెప్పాడు.

మరోవైపు, తన తండ్రి జీవిత చరిత్రతో సినిమాను నిర్మిస్తామని, అందులో తన తండ్రి పాత్రను తానే పోషిస్తానని ఇంతకు ముందు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఎన్టీఆర్ సినిమాను తీస్తున్నట్టు వర్మ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, ఎన్టీఆర్ పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయంపై వర్మ క్లారిటీ ఇవ్వలేదు. ఈ పాత్రను బాలయ్య పోషిస్తారా? లేక మరెవరైనా చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. దీనిపై బాలయ్య నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. 

  • Loading...

More Telugu News