: దీనస్థితిలో బుమ్రా తాతయ్య... గాలికొదిలేసిన క్రికెటర్ పై విమర్శల వెల్లువ!
భారత జట్టులో కీలక ఆటగాడైన జస్ ప్రీత్ బుమ్రాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను చిన్నతనంలో పెంచి, ఆలనా పాలనా చూసిన బుమ్రా తాతయ్య, సంతోఖ్ సింగ్ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో పూటగడవని పరిస్థితుల్లో ఉండగా, ఏడాదికి కోటి రూపాయల వేతనంతో పాటు, ఒక్కో టెస్టుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ-20కి రూ. 3 లక్షలు తీసుకుంటున్న బుమ్రా, ఒక్క రూపాయి కూడా తాతయ్యకు సాయం చేయడం లేదు.
2001లో బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించారు. ఇప్పుడు కొడుకు లేక, మనవడు డబ్బున్నా చూడక, ఆటో డ్రైవర్ గా మారిన సంతోఖ్, 2010లో భార్య చనిపోయిన అనంతరం మరింతగా కుంగిపోయాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఓ ఇరుకు గదిలో ఉంటున్న ఆయన, డబ్బులేక మూడు నెలలుగా అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక బుమ్రా ఆడుతుంటే, కళ్లప్పగించుకుని టీవీకి అతుక్కుపోయే సంతోఖ్, తాను చనిపోయేలోపు కనీసం ఒక్కసారైనా మనవడిని చూడాలని ఉందంటూ తనలోని ఆశను వెలిబుచ్చాడు. ఇక సంతోఖ్ కథనం జాతీయ మీడియాలో ప్రముఖంగా రాగా, పలువురు బుమ్రాను విమర్శిస్తున్నారు.