: చైనా దూకుడు ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున క్షిపణులు కొనుగోలు చేయనున్న ఇండియా.. మోదీ పర్యటనలో ఇదే కీలకం


ఇజ్రాయెల్ అంటేనే ఆధునిక టెక్నాలజీకి మరో పేరు. ముఖ్యంగా ఆయుధాలను తయారు చేయడంలో ఇజ్రాయెల్ ది ఓ చరిత్ర. మన దేశం కూడా రష్యా తర్వాత ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది ఇజ్రాయెల్ నుంచే. మనం ఇప్పటిదాకా కొనుగోలు చేసిన వాటిలో క్షిపణులు, డ్రోన్లు, వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. తాజాగా మన పొరుగు దేశం చైనా సరిహద్దుల్లో దూకుడు పెంచుతోంది. సిక్కిం రాష్ట్రంలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, చైనా సైనికులు ఏకంగా తోపులాటకే దిగుతున్నారు.

 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఇదే సంగతిని ఇటీవల భారత్ కు చైనా గుర్తు చేసి, హెచ్చరికలు పంపింది. దీనికి మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ దీటుగా స్పందించారు. ఇప్పుడున్న భారత్ 1962 నాటిది కాదనే విషయాన్ని చైనా గుర్తుంచుకోవాలని ఘాటుగా స్పందించారు. తద్వారా, చైనాతో యుద్ధానికి కూడా తాము సిద్ధమేనని, ఈ సారి యుద్ధం జరిగితే... చైనాకు తగిన శాస్తి తప్పదనే తరహాలో వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, హిందూ మహాసముద్రంలోకి యుద్ధనౌకలను పంపించింది చైనా. మన నేవీ విభాగం చైనా యుద్ధనౌకల ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తోంది.

ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనాను ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. ఈ క్రమంలో మన ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకున్న ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం ఇజ్రాయెల్ లో అడుగుపెట్టబోతున్నారు. మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడానికి ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు వేచి చూస్తున్నారు. వీరిద్దరి భేటీలో రక్షణ ఒప్పందాలే కీలకంకానున్నాయి. చైనా దూకుడు నేపథ్యంలో, ఇజ్రాయెల్ నుంచి 250 బిలియన్ డాలర్ల వ్యయంతో పెద్ద ఎత్తున క్షిపణులను కొనుగోలు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఇప్పటికే స్పైక్, బరాక్-8 క్షిపణుల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఈ క్షిపణులన్నీ మన అమ్ములపొదిలోకి చేరితే, చైనా మరింత ఇరకాటంలో పడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News