: ఉత్తరప్రదేశ్‌లో ఘోరాతి ఘోరం.. వృద్ధులను పులులకు ఆహారంగా వేసి ఆపై పొలాల్లో పడేస్తున్న కుటుంబ సభ్యులు.. ప్రభుత్వం నుంచి పరిహారంగా లక్షల వసూలు!
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో మానవసంబంధాలకే మచ్చ తెచ్చే ఘటన నిరాటంకంగా కొనసాగుతోంది. మనుషుల మధ్య సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో కళ్లకు కట్టే ఘటనలు వెలుగు చూస్తున్నా, తాజాగా బయటపడిన సంఘటనలు మాత్రం అందరినీ విస్మయ పరుస్తున్నాయి. విషయం తెలిసిన సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.
ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ (పీటీఆర్) చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ కుటుంబంలోని వృద్ధులను పీటీఆర్‌లోని పులులకు ఆహారంగా వేసేస్తున్నారు. అనంతరం వారి కళేబరాలను తెచ్చి పొలాల్లో పడేస్తున్నారు. తర్వాత వాటిని చూపించి పరిహారంగా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారు.
ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వరుసగా ఏడుగురు వృద్ధులు మలా అటవీ ప్రాంతంలో పులుల చేతికి చిక్కి మరణించడాన్ని అనుమానించిన అధికారులు దీనివెనక ఏదో మర్మం ఉందని గుర్తించారు. ఈ మరణాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన కలీమ్ అథర్ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది.
పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలను గట్టెక్కించేందుకు ఇది తప్ప మరో మార్గం లేదని పీటీఆర్ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు భావిస్తున్నట్టు జర్నైల్ సింగ్ (60) అనే స్థానికుడు చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. జూలై 1న 55 ఏళ్ల మహిళ మృతదేహం పొలంలో లభ్యమైంది. ఆమెను పులే పొట్టనపెట్టుకుందని కుటుంబ సభ్యులు వాదించారు. సోమవారం ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్స్ కన్జర్వేటర్ వీకే సింగ్ సందర్శించారు. ఆమె మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తెచ్చి అక్కడ పడేసినట్టు ఆయన గుర్తించారు. సమీపంలోని అడవి లోపల 1.5 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతి చెందినట్టు ఆధారాలను బట్టి గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అమానుషం బయటకు వచ్చింది.