: సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
ఆమధ్య ప్రముఖ సినీ నటి భావనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించడంతో జైళ్లోనే ఉన్నాడు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మలయాళ స్టార్ హీరో దిలీప్ ను సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా వారి వ్యాపార కార్యకలాపాల రికార్డులు, బ్యాంకు పేమెంట్స్ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. భావనపై వేధింపులకు పాల్పడిన అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
ఈ నేపథ్యంలో భావనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోల మెమరీ కార్డును కావ్య మాధవన్ ఆఫీస్లో దాచి పెట్టిఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మొదటి భార్యకు విడాకులిచ్చిన దిలీప్ 2016లో కావ్యామాధవన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని భావన తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే, దిలీప్, భావన కలసి పలు సినిమాల్లో నటించారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సమయంలో వారి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అందుకే, దిలీప్ రెండో వివాహాన్ని భావన తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలోనే భావనపై లైంగిక వేధింపులు జరగగా, దిలీప్ ప్రోద్బలంతోనే పల్సర్ సునీ ఇదంతా చేశాడని కథనాలు వెలువడ్డాయి.