: టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించిన రవిశాస్త్రి!
టీమిండియా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ మాజీ డైరెక్టర్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభ్యర్థన మేరకు టీమిండియా హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి తన దరఖాస్తును సమర్పించినట్టు సమాచారం. అంతేకాకుండా, భారతజట్టు ఆటగాళ్లు కూడా హెడ్ కోచ్ గా రవిశాస్త్రిని నియమిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 9 కాగా, ఇంటర్వ్యూలు ఈ నెల 10న ముంబయిలో జరగనున్నాయి. కాగా, టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, దొడ్డా గణేశ్, లాల్ చంద్ రాజ్ పుత్, ఆసీస్ మాజీ ప్లేయర్ టామ్ మూడీ, విదేశీ కోచ్ రిచర్డ్ పైబస్ ఉన్నారు.