: 15 ఏళ్లుగా నాశనమవుతున్న సినీ పరిశ్రమను కాపాడండి: ఆర్.నారాయణమూర్తి
గత 15 ఏళ్లుగా కొందరు అగ్ర నిర్మాతలు సినీ రంగంపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని... దీని కారణంగా చిన్న నిర్మాతల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ప్రముఖ దర్శకనిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, కేరళ తరహాలో తెలుగు సినీ పరిశ్రమను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని, డిజిటల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సినీ రంగంపై విధించిన 28 శాతం జీఎస్టీని నిరసిస్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతాని దీక్షకు పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మద్దతు ప్రకటించారు.