: ప్రధాని అయ్యే అర్హత నాకు లేదు: సీఎం నితీష్ కుమార్
ప్రధాన మంత్రి రేసులో తాను లేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాను ఇంతకు ముందే చెప్పానని... ప్రధాని అయ్యే అర్హత తనకు లేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ వైఖరి అవసరమని... ఏదో ఒక విధంగా ప్రతిస్పందిస్తే చాలనే వైఖరి సరిపోదని ఆయన చెప్పారు. విపక్ష పార్టీల్లో కాంగ్రెస్ అతి పెద్దదని... ప్రతిపక్షాన్ని ముందుండి నడిపించే ఎజెండాను తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని అన్నారు. జీఎస్టీని కాంగ్రెస్ తో పాటు బీహార్ లో తనతో పాటు అధికారాన్ని పంచుకుంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ... నితీష్ మాత్రం ఈ అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. విపక్షాలను ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ దే అని చెప్పారు.