: ఇంతటి స్థాయిలో పన్ను పెంచడం టూ మచ్!: తమిళ దర్శకుడు శంకర్
ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ నేపథ్యంలో తమపై అధిక భారం పడుతోందని నిరసన తెలుపుతూ తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యం సినిమా హాళ్ల బంద్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమపై భారం పడుతుందని తమిళ సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ కూడా ఈ విషయంపై స్పందించారు. వినోదపు పన్నును అమాంతం 48 శాతం, 58 శాతం శ్లాబులకు పెంచడం అంటే చాలా ఎక్కువ అని ఆయన ట్వీట్ చేశారు. తమిళ సినీ పరిశ్రమను కాపాడండని ఆయన కోరారు. ఈ రోజు ప్రారంభించిన బంద్ కారణంగా తమిళనాడులో సుమారు 1,100 థియేటర్లు తెరచుకోలేదు.
కాగా, తమిళనాడులో వినోదపు పన్ను విషయంలో ద్వంద్వ పన్ను విధానాన్ని అవలంబిస్తున్నారు. జీఎస్టీకి అదనంగా 30 శాతం మేర స్థానిక సంస్థల పన్నును జోడిస్తున్నారు. దీంతో 100 రూపాయల టికెట్ వరకు 18 శాతం జీఎస్టీకి అదనంగా 30 శాతం స్థానిక పన్ను (మొత్తం 48 శాతం), 100 రూపాయల పైన టికెట్ కి 28 శాతం జీఎస్టీకి అదనంగా 30 శాతం (మొత్తం 58 శాతం) విధిస్తున్నారు.