: దూసుకొస్తున్న చైనా సైనికులను చేతులతో తోసేస్తున్న భారత దళాలు... వీడియో విడుదల
భారత్, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వేళ, హద్దుమీరుతున్న చైనా సైనికులను ఆపేందుకు భారత సైనికులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో విడుదల కాగా, అన్ని టీవీ చానళ్లూ దీన్ని ప్రముఖంగా చూపుతున్నాయి. దూరంగా చైనా సరిహద్దును స్పష్టంగా చూపుతూ జెండాలు కనిపిస్తుండగా, దాన్ని దాటి భారత భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులు, భారత సైనికుల మధ్య తోపులాట జరిగింది.
చేతిలో గన్స్ ఉన్నా, వాటిని ప్రయోగించకుండా సంయమనం పాటిస్తున్న భారత సైన్యం, చేతులతోనే చైనా సైనికులను వెనక్కు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. సిక్కిం సరిహద్దుల వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. నెల రోజులుగా కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించగా, భారత్ కూడా సుమారు 3 వేల మందిని ఆ ప్రాంతానికి పంపిన సంగతి తెలిసిందే. ఇండియా సైనికులే తమ భూభాగంలోకి చొరబడ్డారని చైనా మొండిగా వాదిస్తున్నప్పటికీ, ఈ తాజా వీడియో అదంతా తప్పని చూపుతుండటం గమనార్హం.