: ఆఫ్గన్ అమ్మాయిల రోబోటిక్స్ టీమ్ ను తమ దేశానికి రానివ్వని అమెరికా... బోరున విలపిస్తున్న ప్రతిభావంతులు!


వారంతా ఆఫ్గనిస్థాన్ విద్యార్థినులు. నిత్యమూ ఉగ్ర మారణహోమం జరుగుతూ ఉండే ప్రాంతంలో తుపాకుల చప్పుళ్లు వింటూనే తమలోని సత్తాను, టెక్నాలజీ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటాలని భావించారు. ఓ టీమ్ గా ఏర్పడి అద్భుతమైన రోబోను తయారు చేశారు. వాషింగ్టన్ లో జరిగే అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో పాల్గొనాలని భావించారు. కానీ వారి ఆశ కలగా మిగిలిపోగా, ప్రతిభావంతులైన అమ్మాయిలు వలవలా ఏడ్చి బాధపడటం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆరుగురు అమ్మాయిల టీమ్, రోబోటిక్స్ పై ఈ నెలలో జరగనున్న తొలి గ్లోబల్ చాలెంజ్ లో పాల్గొనాలని ఆరు నెలల ముందు నుంచే శ్రమించారు. తమకు అందాల్సిన రా మెటీరియల్స్ రాకున్నా, అందుబాటులో ఉన్న వస్తువులతోనే బంతులను ఓ క్రమంలో అమర్చే రోబోట్ ను తయారు చేశారు. వాషింగ్టన్ వెళ్లి తోటి 'స్టెమ్' (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్) స్టూడెంట్స్ తో మమేకం కావాలని భావించారు. వీరికి ఆఫ్గన్ లో తొలి మహిళా సీఈఓగా గుర్తింపు తెచ్చుకుని సిటాడెల్ సాఫ్ట్ వేర్ కంపెనీని నడుపుతున్న రోయా మహబూబ్ మద్దతుగా నిలిచారు. పశ్చిమ ఆఫ్గనిస్థాన్ ప్రాంతంలో ఉన్న వీరికి అండగా ఉన్నారు.

ఇక వారి రోబో రెడీ అయింది. అమెరికాకు వెళ్లే నిమిత్తం వీసాలను మంజూరు చేయాలని కాబూల్ లోని యూఎస్ ఎంబసీకి వెళ్లిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. వీసా కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో బాంబు దాడులు ఏ క్షణమైనా జరుగుతూ ఉంటాయని తెలిసినా, వీరంతా ధైర్యంగా దరఖాస్తులు అందించారు. తమకు వీసా వస్తుందన్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ, అందరి వీసాలనూ ఎంబసీ అధికారులు రిజెక్ట్ చేశారు.

"ఈ వార్త తెలిసిన తరువాత వారంతా ఒక రోజు మొత్తం ఏడుస్తూ ఉండిపోయారు. నేను వారితో మాట్లాడలేకపోయాను. వారి బాధను ఎలా తీర్చాలో తెలియలేదు. వారు చాలా నిరాశ చెందారు" అని రోయా మహబూబ్ వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న వీరిని 'ఫోర్బ్స్' ఇంటర్వ్యూ చేసింది. "మేమేం చేయగలమో చూపించాలనుకున్నాం. అందుకు మాకో అవకాశం కావాలి" అంటూ టీమ్ లోని 14 సంవత్సరాల ఫతేమా చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది స్పందించి వారికి వెంటనే వీసాలు ఇవ్వాలని అమెరికాను కోరారు. వీరికి ఎందుకు వీసాలను నిరాకరించారన్న విషయమై అమెరికన్ అధికారులు ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇరాక్, ఇరాన్, సూడాన్ నుంచి కూడా ఇదే పోటీకి టీమ్ లు వెళుతుంటే, ఆఫ్గన్ అమ్మాయిలకు ఎందుకు చాన్స్ ఇవ్వట్లేదని ఇప్పుడు అమెరికాను ఎందరో ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పెద్దన్న కరుణిస్తాడో లేదో!

  • Loading...

More Telugu News