: ఇరాన్ కు రూ. 70 వేల కోట్ల బెస్ట్ ఆఫర్ ఇచ్చిన భారత్!
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) కొనుగోలుదారుగా ఉన్న భారత్, తన భవిష్యత్ అవసరాలను తీర్చుకునే దిశగా ఇరాన్ కు బంపరాఫర్ ఇచ్చింది. ఆ దేశంలో భారీ సహజవాయు ప్లాంటును అభివృద్ధి చేసి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి మంచి లాభాలను అందిస్తామని చెబుతూ, 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 71 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఓఎన్జీసీ నేతృత్వంలోని ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ పేర్కొంది. ఫర్జాద్-బీ చమురు క్షేత్రంలో 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. రూ. 38.84 వేల కోట్లు) పెట్టుబడి పెడతామని, మిగతా ఇన్వెస్ట్ మెంట్ ను సహజవాయువును ఎగుమతి చేసే ప్లాంటు నిమిత్తం ఖర్చు చేస్తామని ఓఎన్జీసీ అంతర్జాతీయ పెట్టుబడుల విభాగం ఎండీ నరేంద్ర కుమార్ వర్మ వెల్లడించారు.
ఈ పెట్టుబడులకు అనుమతిస్తే, సాలీనా 18 శాతం ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. "వారికి మేము అత్యుత్తమ ఆఫర్ ఇచ్చాం. దీనికి అంగీకరించాలా? వద్దా? అన్నది వారిష్టం. మాకు నామమాత్రపు లాభాలు చాలని, దేశ అవసరాలను తీర్చుకోవడమే మా ఉద్దేశమని ఇరాన్ అధికారులకు స్పష్టం చేశాము" అని ఆయన అన్నారు. కాగా, భారత్ నుంచి పెట్టుబడులను ఆహ్వానించే విషయమై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2009 నుంచి ఫర్జాద్-బీ చమురు క్షేత్రంపై పట్టు కోసం ఒఎన్జీసీ తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్షేత్రంలో సుమారు 19 ట్రిలియన్ ఘనపు అడుగుల సహజవాయు నిల్వలు ఉన్నాయని అంచనా.