: లోయలో పడిన మినీ బస్సు... అమెరికాలో భువనగిరి టెక్కీ మృతి
పుట్టిన రోజునాడు స్నేహితులతో కలసి పార్టీ చేసుకుని, ఆనందంగా తిరుగు ప్రయాణమైన యువ ఐటీ ఇంజనీర్ ను విధి వంచించింది. యూఎస్ లోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలోని బాహార్ పేటకు చెందిన పి.ప్రదీప్ (35) మరణించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నార్త్ కరోలినాలోని డెల్ కంపెనీలో గడచిన ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ప్రదీప్ తన భార్య కీర్తన, మరో ఎనిమిది మందితో కలసి బర్త్ డే వేడుకల కోసం వెస్ట్ వర్జీనియాలోని సుటాన్ లేక్ వద్దకు వెళ్లాడు.
వేడుకల అనంతరం మినీ బస్సులో వస్తుండగా, అదుపుతప్పిన బస్సు ఓ లోయలో పడిపోయింది. ప్రదీప్ అక్కడికక్కడే మరణించగా, ఆయన భార్య కీర్తన, మరో జంట రవి, ప్రణీతలతో పాటు ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలిసిన తరువాత బాహార్ పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రదీప్ ఇంటికి వచ్చి అతనితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రదీప్ మృతదేహాన్ని భువనగిరికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కుటుంబీకులు తెలిపారు.