: సినీ నిర్మాతకు బెదిరింపులు... జూబ్లిహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు


హైదరాబాదుకు చెందిన సినీ నిర్మాత కేెఎల్. దామోదర ప్రసాద్ ను గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ లో అసభ్య పదజాలంతో బెదిరించడంతో ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దామోదర ప్రసాద్ జూబ్లీహిల్స్‌ సమీపంలోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఫోన్‌ కాల్‌ రాగా ఆయన పని ఒత్తిడిలో పడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాలుగో సారి వరుసగా ఫోన్ రింగ్ కావడంతో ఆయన లిఫ్ట్ చేసి, 'ఎవరూ?' అంటూ ప్రశ్నించేలోపు అవతలి వ్యక్తి పెద్దగా కేకలు వేస్తూ ఫోన్ లో అసభ్య పదజాలంతో దూషణకు దిగాడు.

తన పేరు నిఖిల్ రస్తోగీ అంటూ తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి.రామకృష్ణగౌడ్‌ కు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చి మ్యాటర్‌ సెటిల్‌ చేసుకోవాలని, లేకపోతే అంతుచూస్తామని హెచ్చరించాడు. ఆయనతో తనకు పరిచయం మాత్రమే ఉందని, తాను ఎవరికీ డబ్బులు బాకీ పడలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఎక్కువ మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తూ ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 507 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News