: డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోనున్న రైల్వే ఉద్యోగులు.. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్!
రైల్వే ఉద్యోగులు ఇకపై సరికొత్త డిజైనర్ దుస్తులు ధరించి సేవలందిస్తూ కనువిందు చేయనున్నారు. ప్రయాణికులతో నిత్యం టచ్ లో ఉండే సిబ్బందికి ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ రితూ బేరి రూపొందించిన డిజైనర్ దుస్తులను అందజేయనున్నారు. రైల్వే కార్యాలయ ఉద్యోగులు, స్టేషన్ మాస్టర్లు, టీటీఈలు, గార్డులు, డ్రైవర్లు, ఆహార సరఫరా సిబ్బంది.. ఇలా విభాగాలను బట్టి వేర్వేరు దుస్తులను అందజేయనున్నారు. ఈ మేరకు నమూనాలను తయారు చేసి ఆమె రైల్వే శాఖకు పంపించారు.
వీటిల్లో కొన్ని డిజైన్లను ఆమోదించిన రైల్వే శాఖ అక్టోబర్ నుంచి వీటిని అమలులోకి తీసుకురానుంది. మెరుపు జాకెట్లు, టీ షర్టుల రూపంలో ఉన్న యూనిఫాం రైల్వే లోగోతో ఆకర్షణీయంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ధరిస్తున్న యూనిఫాం ఎన్నో ఏళ్ల కింద తయారు చేసినదని, ఈ యూనిఫాం కూడా కేవలం స్టేషన్ మాస్టర్లు, టీటీఈలకు మాత్రమే అందజేశారని రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 5 లక్షల మంది రైల్వే సిబ్బందికి సరికొత్త యూనిఫాంను అందజేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే వర్క్ షాప్ సిబ్బందికి కూడా కొత్త యూనిఫాం అందిస్తామని వారు తెలిపారు.