: ఎర్రగా మారిన చద్దన్నం... రంగంలోకి దిగిన పరిశోధకులు... 56 బస్తాల బియ్యం స్వాధీనం!


తెల్ల బియ్యంతో వండిన అన్నం తెల్లగానే ఉంటుంది. అయితే అలాంటి తెల్ల అన్నం తెల్లారేసరికి ఎర్రగా మారితే? ఆశ్చర్యమే కదా? ఇలాంటి ఘటనే తమిళనాడులోని తేని సమీపంలోని శంకకోణాంపట్టికి చెందిన రైతు నీలకంఠన్‌ నివాసంలో చోటుచేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే... నీలకంఠన్ కుటుంబ సభ్యులు గత రాత్రి భోజనం చేసి, మిగిలిన అన్నంలో గంజితో పాటు నీళ్లు కూడా పోసి ఉంచారు. ఉదయం తినేందుకు పాత్రపై మూత తొలగించి చూడగా, అన్నం ఎర్రరంగులోకి మారిపోయి కనిపించింది. దీంతో వారు ఆందోళన చెంది, ఈ విషయాన్ని ఆహార భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ బియ్యం ఎక్కడ కొనుగోలు చేశారంటూ ప్రశ్నించారు.

దీంతో వారు బియ్యం దుకాణాన్ని చూపించగా, అవే రకానికి చెందిన 56 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల నిమిత్తం అన్నంతోపాటు బియ్యాన్ని కూడా ల్యాబ్ కు పంపారు. సాధారణంగా అన్నం అలా రంగు మారదని, బియ్యంలో ఏదైనా రసాయనం కలిస్తేనే అలా మారుతుందని వారు తెలిపారు. ఈ బియ్యంతో చేసిన అన్నం తింటున్నప్పటి నుంచి నీలకంఠన్ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని, కడుపునొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత ఏం జరిగిందనేది వివరిస్తామని ఆహారభద్రతాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News