: జీఎస్టీ ఎఫెక్ట్: భారం కానున్న వంట గ్యాస్.. తగ్గనున్న రాయితీ.. నెలకు రూ.32 వరకు అదనపు భారం!


జీఎస్టీ ప్రభావంతో సామాన్యుల నెత్తిన ‘బండ’ పడింది. వంట గ్యాస్ వినియోగదారులు ఇక నుంచి గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెల రూ. 32 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రభావంతో వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గణనీయంగా తగ్గనుంది. ఫలితంగా సిలిండర్ రేటు పెరగనుంది. కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు ఇన్స్‌పెక్షన్, ఇన్‌స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అదనపు సిలిండర్‌కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంతో వినియోగదారుల నెత్తిన భారం తప్పేలా కనిపించడం లేదు.

నిజానికి ఎల్‌పీజీని ప్రభుత్వం 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో ఢిల్లీ తదితర కొన్ని రాష్ట్రాలు దీనిపై పన్ను విధించకపోవడంతో వ్యాట్ 2 శాతం నుంచి 4 శాతం మధ్య ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ అమలుతో సిలిండర్ ధర రూ.12-15 వరకు పెరిగే అవకాశం ఉంది.  మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు రూ.119.85 పైసలు రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో రూ.107 మాత్రమే పడడం ఇందుకు ఊతమిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్‌పై వినియోగదారులకు రూ.32 వరకు చేతి చమురు వదిలే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News