: కుంటాల జలపాతంలో కొట్టుకుపోయిన ఇద్దరు కుర్రాళ్లు.. చోద్యం చూస్తూ వీడియోలు తీసుకున్న యువకులు!
ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతంలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. కుంటాల జలపాతం అందాలను వీక్షించేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు యువకులు వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను చూసి మైమరిచి పోయిన యువకులు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. 180 అడుగుల ఎత్తున ఉన్న వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లి ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు.
ఇంతలో ఇద్దరు యువకులు కాలుజారి జలపాతంలో పడిపోయారు. ఈ సమయంలో పలువురు వారిని వీడియో తీస్తూ వుండిపోయారే తప్ప, వారిని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో వారిద్దరూ అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసి ఉంటే వారు బతికేవారని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం 11 మంది గజ ఈతగాళ్లు రాత్రి నుంచి వెతుకుతున్నా వారి మృతదేహాలు లభ్యం కాలేదు.