: ముస్లింలంతా ఏకమైతే 90 ఎంపీ స్థానాలు మనవే: అక్బరుద్దీన్ ఒవైసీ
ముస్లింలంతా ఏకమైతే ఎన్నికల్లో 50 నుంచి 90 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవచ్చని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత, దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు సేవ చేసేందుకు ముందుకొచ్చే వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన కుర్చీని సైతం అప్పగించి వారి కింద పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఆరేళ్ల క్రితమే తాను చావును జయించానని, తనకు ఎవరిపైనా కక్ష లేదని ఆయన తెలిపారు. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ మైనార్టీలతో పాటు హిందువులను కూడా సమానంగా గౌరవించారని చెప్పిన ఆయన, దేశంలో ముస్లింలపై దాడులు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా తప్పుడు కథనాలతో తనపై కొన్ని పత్రికలు దాడి చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దేశంలో ఎన్ని పార్టీలున్నా ముస్లింల కోసం పోరాడేది మాత్రం మజ్లిస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు.