: నాలుగో వన్డేలో విండీస్ చేతిలో భారత్ ఓటమి.. ఐదో వన్డేకు షిఫ్ట్ అయిన సిరీస్ ఫలితం!


ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య విండీస్ 11 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 190 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు. విండీస్ బౌలర్ల దెబ్బకు 49.4 ఓవర్లలోనే 178 పరుగులకు ఆలౌటయ్యారు. విండీస్ కెప్టెన్, మీడియం పేసర్ అయిన జాసన్ హోల్డర్ ధాటికి టీమిండియా బ్యాటింగ్ పేకమేడలా కూలింది. 9.4 ఓవర్లు వేసిన హోల్డర్ రెండు మెయిడెన్లు వేసి 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు. అల్‌జరి జోసెఫ్ 2, దేవేంద్ర బిషూ, విలియమ్స్, ఆష్లే నర్స్ తలా ఓ వికెట్ తీసి మిగతా పనిని పూర్తి చేశారు.  

టీమిండియా ఓపెనర్ అజింక్య రహానే (60), మహేంద్ర సింగ్ ధోనీ (54), హార్ధిక్ పాండ్యా (20)  మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. శిఖర్ ధవన్ 5, కెప్టెన్ కోహ్లీ 3, దినేశ్ కార్తీక్ 2, కేదార్ జాదవ్ 10, రవీంద్ర జడేజా 11, కుల్దీప్ యాదవ్ 2, ఉమేశ్ యాదవ్ 0, మహ్మద్ షమీ 1 పరుగు చేశారు. ఫలితంగా 11 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. హోల్డర్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో విండీస్ 1-2తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. సిరీస్ ఫలితం 6 వ తేదీన జరగనున్న చివరి వన్డేకు మారింది.

అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్ 35, కైల్ హోప్ 35, షాయ్ హోప్ 25, రోస్టన్ చేజ్ 24, జాసన్ మహ్మద్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల పరుగులు సాధించేందుకు అవస్థలు పడ్డారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు నేలకూల్చగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

  • Loading...

More Telugu News