: పవన్ కల్యాణ్ సింహం లాంటి వాడు.. గాండ్రించాలి కానీ దగ్గకూడదు!: రాంగోపాల్ వర్మ
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఒక టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ట్వీట్లలో చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నాడని అభిప్రాయపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆయన మాట్లాడుతుంటే ఒక్కో వ్యక్తి రోమాలు నిక్కబొడుచుకునేవని, పవన్ కల్యాణ్ స్పీచ్ లు కూడా ఆయనను తలపిస్తుంటాయని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే చిరంజీవిగారికి మాత్రం అలా స్పీచ్ ఇచ్చేంత వాయిస్ లేదని అన్నారు.
ఈ మధ్య కాలంలో మాత్రం పవన్ కల్యాణ్ స్పీచ్ లలో మొదటి నుంచి చివరి వరకు వాడి ఉండడం లేదని అన్నారు. స్పీచ్ మధ్యలో సోఫిస్టికేటెడ్ ఇంగ్లిష్ పేరుతో చెప్పాలనుకున్న అంశాన్ని చెప్పలేక డైల్యూట్ చేస్తున్నాడని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎవరి మద్దతూ పవన్ కల్యాణ్ కు అవసరం లేదని వర్మ స్పష్టం చేశారు. పవన్ కల్యాణే పెద్ద స్టార్ అయినప్పుడు అతని కంటే చిన్న స్టార్స్ నుంచి సపోర్ట్ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని వర్మ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ స్పీచ్ లు మొదట్లో అగ్రెసివ్ గా కపించాయని, తరువాత తరగతి గదిలో లెక్చరర్ చెప్పే క్లాసుల్లా మారిపోయాయని వర్మ పేర్కొన్నారు.
చెబితే బాగోదు కానీ తనకు పోర్న్ స్టార్స్ ఎంత ఇష్టమో... పవన్ కల్యాణ్ కూడా అంతే ఇష్టమని అన్నారు. అయితే వీరిద్దరూ దూరం నుంచి ఇష్టమని, బాగుంటారని దగ్గరకెళ్తే వాళ్లు మనుషుల్లా కనిపిస్తారు కనుక పవన్ కల్యాణ్ జనసేన తరపున పోటీ చేయమని అడిగినా వెళ్లనని వర్మ చెప్పారు. పవన్ కల్యాణ్ సింహం లాంటి వాడని, సింహం గాండ్రించాలి కానీ దగ్గకూడదని తెలిపారు. అలాగే పవన్ కల్యాణ్ ను అర్జునుడితో పోల్చి అవమానించవద్దని సూచించారు. అర్జునుడు ప్రతి సందర్భంలోనూ ధర్మరాజు, లేదా కృష్ణుడు ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబితే అది చేశాడని, సొంతంగా ఏమీ చేయలేదని పవన్ కల్యాణ్ ను అర్జునుడితో పోల్చవద్దని వర్మ రిక్వెస్ట్ చేశారు.