: మా అమ్మాయి చనిపోయింది... ఇక ఆమె కేరెక్టర్ ను కూడా చంపకండి!: శిరీష బాబాయి


తమ శిరీష చనిపోయిందని.... ఇక ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదన్న కారణంతో ఆమె కేరెక్టర్ ను కూడా చంపవద్దని ఆమె బాబాయి శ్రీనివాసరావు కోరారు. ఈ కేసు మొదట్లో ఆమె నిరుపేద అని, విజయలక్ష్మిగా వచ్చి శిరీషగా మారిందంటే ఆమె కేరక్టర్ ఏమిటో చెప్పవచ్చు.. అంటూ కొన్ని టీవీ ఛానెళ్లు చెప్పాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తాతగారు రికార్డ్స్ లో విజయలక్ష్మి అని వేయడంతో ఆమె పేరు అదయిందని, కానీ ఆమె పేరు శిరీష అని, ఇంట్లో మాత్రం తాము చిన్ని అని పిలుచుకునేవారమని ఆయన అన్నారు.

ఆమె ఇల్లు ఎకరం భూమిలో ఉందని, వారింట్లో ఏసీ సౌకర్యం ఉందని ఆయన చెప్పారు. మరి ఏ రకంగా వారు పేదవారని ఆయన మీడియా సంస్థలను నిలదీశారు. అయినా ఆమె పేదదైతే కేరక్టర్ లేనిదవుతుందా? ఆత్మగౌరవం ఉండదా? దేశంలో పేదలంతా కేరక్టర్ లేనివాళ్లని మీ ఉద్దేశ్యమా? అని ఆయన నిలదీశారు. పోలీసులు ప్రారంభంలోనే ఒక స్క్రిప్టు రాసుకున్నారని... దానినే పదేపదే చదువుతున్నారని ఆయన చెప్పారు. రెండు రోజుల కస్టడీలో ఏం వెలికితీశారో ఎందుకు చెప్పలేదని ఆయన అడిగారు. విడివిడిగా విచారించి ఏం సాధించారని ఆయన అన్నారు. తాము మీడియా సమక్షంలోనే పోలీసులను కలవాలని అనుకుంటున్నామని, పోలీసులు ఎటునుంచి ఎటైనా కేసులను తిప్పగలరని, వారిని ఢీ కోట్టే సామర్థ్యం, సత్తా తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News