: బీజేపీ నేతలకు దీటుగా సమాధానం చెప్పిన మహిళా పోలీస్ అధికారికి బహుమానం.. ట్రాన్స్ ఫర్!
ఉత్తరప్రదేశ్ లో బెదిరింపులకు దిగిన బీజీపీ నేతలకు దీటుగా సమాధానమిచ్చి జైలుకి పంపిన పోలీసు అధికారిణి శ్రేష్ఠా ఠాకూర్ ను ట్రాన్స్ ఫర్ తో యూపీ ప్రభుత్వం సత్కరించింది. బులంద్ షెహర్ లోని స్యానా సర్కిల్ లో ర్యాలీ చేస్తూ ఒకే బండిపై ముగ్గురు ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించిన శ్రేష్ఠా ఠాకుర్ వారిని ఆపి లైసెన్స్ అడిగారు. లైసెన్స్ చూపించని వారు... 'మేమెవరిమో తెలుసా? బీజేపీ కార్యకర్తలం' అంటూ, తమను అడ్డుకోవడానికి ఎంత ధైర్యం? అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఏమాత్రం వెనక్కి తగ్గిన ఆమె ఎక్కువ మాట్లాడితే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని హెచ్చరించి లైసెన్సులు అడిగారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐదుగురు వ్యక్తులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆమె వారిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. దీనిని వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి ఆమెకు విశేషమైన ఆదరణ లభించింది. ఇంతలో ఆమెను సాన్యా సర్కిల్ నుంచి బహ్రైచ్ కి బదిలీ చేసినట్టు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.