: తక్షణం తనను కలవాలని రామసుబ్బారెడ్డికి సమాచారం పంపిన చంద్రబాబు
జమ్మలమడుగు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్న తనను పక్కనబెట్టి, వైకాపా నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డికి పదవి ఇవ్వడంతో అలకబూని, నిన్న చంద్రబాబును కలిసి తన బాధను వెళ్లగక్కిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని నేడు చంద్రబాబు మరోసారి కలవనున్నారు. రామసుబ్బారెడ్డి వైకాపాలో చేరనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డిని బుజ్జగించాలని తన కుమారుడు లోకేష్, మరో మంత్రి కళా వెంకట్రావులను రంగంలోకి దింపిన చంద్రబాబు, నేడు స్వయంగా తనను వచ్చి కలవాలని ఆయనను ఆదేశించారు.
తనకు టీడీపీని వీడాలన్న ఉద్దేశం లేదని, సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయని రామసుబ్బారెడ్డి చెబుతున్నప్పటికీ, తన వర్గం వారి పనులను ఆదినారాయణ రెడ్డి పట్టించుకోకపోవడం, తన అనుచరుడు ఒకరు నియోజకవర్గంలో వైన్స్ షాపును కోరితే ఇప్పించుకోలేక పోవడం ఆయన అలకకు కారణంగా తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం చంద్రబాబును రామసుబ్బారెడ్డి కలవనున్నారు. ఈ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును రామసుబ్బారెడ్డికి ఇచ్చే విషయంలో స్పష్టత రావచ్చని తెలుస్తోంది.