: గోదావరికి భారీ వరద... ఆగిన పోలవరం కాఫెర్ డ్యామ్ పనులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు, గోదావరి నదిలో వరద నెమ్మదిగా పెరుగుతూ, పోలవరం ప్రాజెక్టు వద్ద 15.5 మీటర్ల ఎత్తునకు చేరుకోవడంతో కాఫెర్ డ్యామ్ నిర్మాణం వాయిదా పడింది. మట్టి కట్టను పూర్తి చేసేందుకు అన్ని రకాల పరీక్షలు పూర్తికాగా, భారీ మిషనరీ సైతం ఇక్కడికి వచ్చింది. ఇక వరద పెరగడం, ఈ సీజన్ వర్షాలు ముగిసేంత వరకూ గోదావరిలో నీటి ప్రవాహం కొనసాగుతుందన్న అంచనాలతో ఇప్పట్లో పనులు చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇక డయా ఫ్రమ్ వాల్ పనుల్లో 660 మీటర్ల ప్లాస్టిక్ కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వుండగా, ఇప్పటివరకూ 500 మీటర్లను పూర్తి చేశారు. వర్షాలు పడకుండా ఉంటేనే మిగతా పనులు చేపట్టే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మాత్రం పనులు చేస్తున్నామని, భారీ వర్షాలు కురిస్తే, ఆ పనులూ ఆగుతాయని తెలిపారు.