: 'ఒకే దేశం - ఒకే పన్ను ఎక్కడ?' తొలి జీఎస్టీ బిల్లులను చూపిస్తూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు


శనివారం నుంచి వస్తు సేవల పన్ను అమలులోకి రాగా, ఇప్పటికే 'ఒకే దేశం - ఒకే పన్ను' అమలు కావడం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమ తొలి బిల్లులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పన్ను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ జలంధర్, ముంబై రెస్టారెంట్లలోని బిల్లులను పోస్టు చేస్తూ, జీఎస్టీ వ్యత్యాసాలను ఎత్తిచూపారు. వన్ నేషన్, వన్ టాక్స్ ఎక్కడ అమలవుతోందని ఆయన ప్రశ్నించగా, ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక పలువురు పాత బిల్లులను, కొత్త బిల్లులను కలిపి పోస్టు చేస్తూ, తమ జేబులకు ఎలా నష్టం కలుగుతోందన్న విషయాన్ని వివరిస్తున్నారు.

కాగా, జీఎస్టీ కౌన్సిల్ సైతం, ప్రజలు తమ తొలి జీఎస్టీ బిల్లులను పంచుకోవాలని సూచించింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం నాడు రూ. 133తో మసాలా దోశ, సాంబార్ వడను తిన్నానని, శనివారం అదే అల్పాహారానికి బిల్లు రూ. 148 అయిందని పేర్కొన్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం ప్రముఖ హోటల్ కు వెళ్లి 1,577 బిల్లును చేయగా, రూ. 183 జీఎస్టీ చెల్లించాల్సి వచ్చిందని వాపోయింది. ఇక గ్రాసరీ స్టోర్లు, షాపింగ్ లు తదితరాలకు సంబంధించిన బిల్లుల పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News