: విజయవాడలో మాయమైన అమ్మాయిలు... విశాఖలో ప్రత్యక్షం!
విజయవాడలో నిన్న కాలేజీకని వెళ్లి, హాస్టల్ కు తిరిగి రాకుండా అదృశ్యమైన ఇంటర్, నర్సింగ్ విద్యార్థినులు కీర్తి, దీప్తి, మౌనిక, మాధవి విశాఖపట్నంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారు సెల్ ఫోన్ వాడటంతో, లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కాలేజీలో మొబైల్ ఫోన్ వాడినందున లెక్చరర్లు మందలించారని, ఆ కారణంగానే వారు హాస్టల్ నుంచి పారిపోయారని తెలిపారు. వారిని తిరిగి తీసుకు వచ్చేందుకు హాస్టల్ యాజమాన్య సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాన్ని విశాఖకు పంపించామని తెలిపారు. వారి ఆచూకీ తెలియడంతో హాస్టల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నలుగురూ నాలుగు గ్రామాలకు చెందిన వారని, వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించామని తెలిపారు. ఓ బాలిక తల్లిదండ్రులు విశాఖలో ఉండటంతో, వారితో ప్రత్యేకంగా మాట్లాడామని పేర్కొన్నారు.