: విజయవాడలో అదృశ్యమైన నలుగురు విద్యార్థినులు
విజయవాడలో ఇంటర్, నర్సింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇక్కడి సూర్యారావుపేటలోని బిషప్ అజరయ్య వసతి గృహంలో ఉన్న వీరు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. కీర్తి, దీప్తి, మౌనిక, మాధవి అనే విద్యార్థినులు అదృశ్యం అయ్యారని, వసతి గృహం యాజమాన్యం నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ వెంటనే వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ల సాయంతో వారు ఎక్కడున్నారన్న విషయమై కొంత సమాచారాన్ని సేకరించామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారిని తిరిగి విజయవాడకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా వారిని గుర్తిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరు కావాలనే పారిపోయారా? లేక ఎవరైనా బలవంతంగా తీసుకువెళ్లారా? అన్న విషయమై మరింత స్పష్టత రావాల్సివుంది.