: పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే: అమెరికా
ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా గుర్తిస్తున్నట్టు తక్షణం ప్రకటించాలని, ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సెనెటర్ టెడ్ పోయ్ డిమాండ్ చేశారు. పాక్ కు అందిస్తున్న సైనిక సాయాన్ని నిలిపివేయాలని కూడా ఆయన అన్నారు. ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తున్న పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు రానున్నాయని అభిప్రాయపడ్డ టెడ్, పాక్ మారకుంటే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.
"వారికి సైనిక సాయాన్ని ఆపండి. డబ్బులివ్వడాన్ని ఆపండి. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశమని ప్రకటించండి" అని ఆయన వ్యాఖ్యానించినట్టు పీటీఐ పేర్కొంది. చాలా మంది అమెరికన్లకు పాక్ గురించి పూర్తి సమాచారం తెలియదని టెడ్ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అత్యంత సుదీర్ఘ యుద్ధం ఉగ్రవాదులతో జరుగుతోందని, పాక్ ను నిలువరిస్తే, ఇది మరింత సులువు అవుతుందని చెప్పుకొచ్చారు.