: కరుడుగట్టిన ఉగ్రవాది లష్కరీని కాపాడేందుకు కాశ్మీర్ యువత ప్రయత్నం... అయినా వెనుకంజ వేయకుండా మట్టుబెట్టిన సైన్యం!
లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది బషీర్ లష్కరీ అలియాస్ బషీర్ అహ్మద్ వానీ సహా ఆజాద్ దాదా అనే మరో ముష్కరుడిని శనివారం నాడు భద్రతా బలగాలు మట్టుబట్టెన సంగతి తెలిసిందే. గత నెలలో పోలీసు బృందంపై దాడి జరిపిన కేసులో వీరిద్దరే ప్రధాన నిందితులు. అనంత్ నాగ్ జిల్లాలోని దియాల్గమ్ సమీపంలోని బ్రెంతి - బాత్ పోరా గ్రామంలో వీరిద్దరూ ఉన్నారని తెలుసుకుని చుట్టుముట్టిన పోలీసులు స్థానిక యువత నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎన్ కౌంటర్ కొనసాగుతున్న సమయంలోనే పలువురు నిరసనలకు దిగి పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన వేళ, ఇద్దరు పౌరులు మరణించారు. ఇలా ఉగ్రవాదులకు స్థానిక యువత నుంచి మద్దతు లభిస్తుందని తాము భావించలేదని సైనికాధికారి ఒకరు తెలిపారు. కాల్పులు ముగిశాయని, ఇద్దరు ఉగ్రవాదులనూ మట్టుబెట్టామని వెల్లడించారు. అంతకుముందు పౌరులను అడ్డుపెట్టుకుని పారిపోయేందుకు లష్కరీ చేసిన ప్రయత్నమూ విఫలమైందని తెలిపారు.